|
ఓ మహిళగా కనిమొళికి మద్దతుగా ఆమె వెనుక నేనున్నానని డీఎంకే పార్టీ నాయకురాలు, సినీనటి ఖుష్భూ భరోసా ఇస్తోంది. కనిమొళి ఎప్పుడూ వాస్తవాలే చెపుతారని వత్తాసు పలికింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా వాదిస్తోంది.కనిమొళి ఇపుడు సమస్యల్లో చిక్కుకున్నారనీ, అయితే అవన్నీ నిరాధారమైనవని త్వరలోనే తేలుతుందని ఖుష్భూ విశ్వాసం వ్యక్తం చేశారు. అయినా ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొనగల ధైర్యం కనిమొళికి ఉన్నదని ఆమె చెప్పుకొచ్చింది.ఇదిలావుండగా శుక్రవారం డీఎంకే చీఫ్ ఎంకరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరై 2జీ కుంభకోణంలో తనకెటువంటి సంబంధం లేదని వాదించారు. ఈ వ్యవహారం మొత్తంలో మాజీమంత్రి ఎ.రాజాయే దోషి అన్నట్లు ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు కనిమొళి వాదనలో పస లేదని తేల్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి అరెస్టయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై శనివారం విచారణ జరుగనుంది. ఒకవేళ కోర్టు బెయిల్ నిరాకరిస్తే కనిమొళి కటకటాల వెనక్కి వెళ్లక తప్పదు.

0 comments:
Post a Comment