24 June 2011

జగన్‌కు -రత్నాకర్‌కు లింకు ఏంటి?

పుట్టపర్తికి వెళ్లిన జగన్‌.. అక్కడి సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు నిధులు తరలిపోవడానికి ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రత్నాకర్‌తో భేటీ కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడిది అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. చివరకు బంధువులు సైతం ట్రస్టు నిధులను కొందరితో కలసి రత్నాకర్‌ తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో నిష్ణాతుడైన రాజకీయ- వ్యాపార వేత్తగా విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌ ఆయన ను కలవడం సహజంగానే చర్చనీయాంశమ యింది.

మరోవైపు.. జగన్‌ అటు వెళ్లిన మరు క్షణమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో భేటీ అయి, జగన్‌-రత్నాకర్‌ లింకు లపై విచారణకు ఆదేశించడం ఉత్కంఠకు దారితీస్తోంది. నిజానికి, పుట్టపర్తికి వెళ్లిన జగన్‌ అక్కడ ఉన్న రత్నాకర్‌తో మాట్లాడింది కొద్ది నిమిషాలే అయినప్పటికీ, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు ప్రభుత్వం అనుమా నిస్తోంది. ట్రస్టు నిధులపై పోలీసులు-ప్రభుత్వం డేగ కన్ను వేసినందున, ఆ నిధులను తనకు అప్పగిస్తే ఎలాంటి భయం ఉండదని జగన్‌, రత్నాకర్‌కు అభయం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఈ కోణంలోనే విచారణ ప్రారంభించడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

తండ్రి అధికారం ద్వారా పొందిన సంపదను వివిధ కంపెనీల స్థాపన ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని ప్రతిపక్షాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌, ట్రస్టు సంపదను పుట్టపర్తి దాటించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రత్నాకర్‌ ఇద్దరూ మంతనాలు సాగించిన వైనం వెనుక డబ్బు నేపథ్యమే దాగుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బుకు తాను భరోసా ఇస్తానని, రత్నాకర్‌ వద్ద ఉన్న సంపదను తనకు ఇస్తే దానిని తన అనుభవంతో తెల్లధనంగా మారుస్తానని జగన్‌ ఆయనను కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

పైగా ఆ డబ్బు తన వద్ద ఉంటే ఎవరూ రారని, తాను దానిని వ్యాపారంలో పెట్టుబడిగా మారుస్తానని జగన్‌ అభయం ఇచ్చినట్లు చెబుతున్నారు.జగన్‌-రత్నాకర్‌కు పాత పరిచయాలు ఉన్నాయని, బెంగళూరులో తరచూ వారిద్దరూ కలుసుకునే వారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సాయిబాబా భక్తుల పేరుతో వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి జగన్‌ అండదండలున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సత్యసాయి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచీ వారిద్దరి బంధం మరింత బలపడిందన్న ప్రచారం పుట్టపర్తి వర్గాల్లో జరుగుతోంది.

అదీగాక.. అనంతపురంలో బలంగా ఉన్న జగన్‌ తన అనుచరుల ద్వారా రత్నాకర్‌ డబ్బును పుట్టపర్తి నుంచి దాటించేందుకు సాయం చేసినట్లు ప్రభుత్వం కూడా అనుమానిస్తోంది. ఆ డబ్బును ఏయే రంగాల్లో పెట్టుబడి పెట్టాలన్న అంశంపై వారిద్దరూ ఇప్పటికే టెలిఫోన్లలో చాలాసార్లు మాట్లాడుకున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. బంగారం, బంగారు విగ్రహాలు, డబ్బు సరిహద్దు దాటించేందుకు జగన్‌ అనుచరులు సాయం చేశారన్న అనుమానం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పుడు జగన్‌-రత్నాకర్‌ చెట్టపట్టాల్‌ బహిరంగం కావడంతో ఇకపై వారిద్దరి కార్యకలాపాలు, రత్నాకర్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు.  ఇంతకాలం మానవతావాదంతో రాష్ట్ర ప్రజలకు సేవలందించిన మహామనీషి బాబాపై ఉన్న గౌరవంతో, ట్రస్టుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం చూసీచూడనట్లు వ్యవహరించారు. కానీ, ట్రస్టును నడిపిస్తున్న రత్నాకర్‌తో జగన్‌కు లింకులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక కఠినంగా వ్యవహరించి, భక్తుల సొమ్మును రక్షించాలని నిర్ణయించారు.అందులో భాగంగానే ట్రస్టు సభ్యులపై ఉక్కుపాదం మోపాలని, వారి అక్రమ సంపాదనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.




courtesy:  http://www.suryaa.com

General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us