|
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తమపై విమర్శలు చేయడం చూస్తుంటే జగన్‌కు తామంటే ఉన్న భయం వెల్లడవుతోందని టిడిపి పేర్కొంది. కాంగ్రెస్ పార్టీతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టిడిపిపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కెఎస్ రత్నంలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ ఏం చేస్తుందో..ప్రతిపక్షం ఏం చేస్తుందో కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగి, ఆ పార్టీలో సంపాదించుకున్న జగన్ ఎప్పటికైనా అందులోకే వెళతారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి పి చిదంబరం, రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. అవినీతికి పాల్పడిన రాజా, కనిమొళిపై చర్యలు తీసుకుంటూ వైఎస్ జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకే జగన్‌ను కాపాడుతున్నారని విమర్శించారు. నైతిక విలువల గురించి పదేపదే మాట్లాడే వైఎస్ జగన్ తన వద్దకు వస్తున్న కాంగ్రెస్ శాసన సభ్యులను రాజీనామా చేసి గెలిచి రావాలని ఎందుకు కోరటం లేదని ప్రశ్నించారు. రైతుల గురించి ఎంపిగా పార్లమెంటులో ఎన్నడూ మాట్లాడని జగన్ గుంటూరులో కొంగ జపం చేశారని ఎద్దేవా చేశారు.
www.prajasakti.com

0 comments:
Post a Comment