|
|
తాను భారత్‌కు, భారతీయులకు, హిందువులకు వ్యతిరేకం కాదని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఆఫ్రిది చెప్పాడు. ‘భారతీయులు.. ముస్లింలు, పాకిస్థానీయులంత విశాలహృదయులు కార’ని ఇటీవల ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీంతో అతనిపై విమర్శల జడివాన కురిసింది. దీనిపై ఆ తర్వాత వివరణ ఇచ్చినా ఆ వ్యాఖ్యలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రిది మరోసారి వివరణ ఇచ్చాడు. ‘నేను భారత్‌కు, భారతీయులకు, హిందువులకు వ్యతిరేకం కాదు. భారత్‌లో ముస్లింల లాగే, పాకిస్థాన్‌లోనూ హిందువులు నివసిస్తున్నారు. ఎవరినీ నొప్పించాలన్నది నా అభిమతం కాదు. ఇది చాలా సున్నితమైన అంశం. ఇకపై దీనిపై నేనేం మాట్లాడను’ అంటూ ఆఫ్రిది వివరించాడు. కాగా ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు వెళ్లడం తప్పేనన్నాడు. తాను పుట్టుకతోనే కెప్టెన్‌ను కాదని, అందుకే తప్పులు చేయడం సహజమని అన్నాడు. ఫైనల్లో లంకతో ఆడిన మ్యాచ్‌లో ధోని తరహాలో ముందే వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. ప్రపంచకప్‌లో 21 వికెట్లు తీయడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ఇది తనకు లభించిన గొప్ప గౌరవమన్నాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను జహీర్ ఖాన్‌తో పంచుకుంటానని తాను అనుకోలేదని అన్నాడు. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొనే ఆలోచనేదీ లేదని చెప్పాడు. పాక్ బోర్డు, ప్రజలు ఆదరించినంత కాలం కొనసాగుతానన్నాడు. వచ్చే వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదని, వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.
0 comments:
Post a Comment