|
రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకునేందుకే వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించారని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆయన శనివారం కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు కేవలం అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కొత్త పార్టీలు పెట్టి ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి ఓటర్లు తగిన విధంగా గుణపాఠం నేర్పాలన్నారు.
ముఖ్యంగా, కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక పార్టీలు పోటీ చేస్తున్నాయన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడటం లేదన్నారు. ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతోందన్నారు.
అందువల్ల ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటర్లు ఆచితూచి అడుగు వేయాలన్నారు. అభ్యర్థుల అందచందాలు, ముఖ కవళికలు, వయస్సులను పరిగణనలోకి తీసుకుని ఓటు వేయవద్దన్నారు. అభ్యర్థులను నిశితంగా పరిశీలించాలన్నారు. కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న డీఎల్ రవీంద్రా రెడ్డికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్.వివేకానంద రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రోశయ్య పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ను ప్రత్యేక కోణంలో చూడాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే యూపీఏ బలపడుతుందన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను కాకుండా ఇతరులు ఎన్నికైతే ప్రజలకు ఎలా ఉపయోగపడతారని రోశయ్య ప్రశ్నించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం ముమ్మాటికీ కాంగ్రెస్‌కే చెందుతుందన్నారు.

0 comments:
Post a Comment