12 April 2011

సిబల్.. కమిటీ నుంచి తప్పుకోండి అన్నా హజారే డిమాండ్

గాంధేయవాది అన్నా హజారే చేపట్టిన 98 గంటల ఆమరణ నిరాహరదీక్ష ఫలితంగా ఐదుగురు మంత్రులు, హజారే సహా ఐదుగురు పౌర సమాజ సభ్యులతో ప్రభుత్వం సంయుక్త కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ కమిటీ సభ్యుడైన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్.. ‘లోక్‌పాల్ బిల్లుతో ఒరిగేదేం లేద’ంటూ వ్యాఖ్యలు చేశారన్న వార్తలపై అన్నా హజారే మండిపడ్డారు. ‘మీకలాంటి అభిప్రాయమే ఉంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కమిటీ నుంచి తప్పుకోండి’ అని సిబల్‌నుద్దేశించి ఘాటుగా స్పందించారు. తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధీకి వెళ్లేముందు ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘ఆయన(సిబల్) తన సమయం, మా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు? దేశానికి అవసరమైన వేరే పనులు చేసుకోవచ్చు కదా! సంయుక్త కమిటీలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు?’ అని వ్యాఖ్యానించారు. ‘జన్‌లోక్‌పాల్ బిల్లుతో ఏమీ జరగబోదని మీకంత నమ్మకముంటే, సంయుక్త కమిటీలో మీరుండటానికి వీల్లేదు. రాజీనామా చేసి, వేరే పని చూసుకోండి’ అని సిబల్‌పై ధ్వజమెత్తారు. కమిటీపై నమ్మకం లేకపోతే సిబల్ కమిటీలో కొనసాగకూడదని కిరణ్‌బేడీ అన్నారు. లోక్‌పాల్ బిల్లుపై ఇలాంటి వ్యాఖ్యల వల్ల చట్ట రూపకల్పనలో ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తుతాయని సమాచార హక్కు ఉద్యమ కారుడు, సంయుక్త కమిటీ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ముందు, ముందు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో అన్న అనుమానం కలుగుతుందన్నారు. అవినీతి వల్ల మీకు రేషన్ అందకపోతేనో, పాఠశాలలో ప్రవేశం లభించకపోతేనో ఈ బిల్లు సాయపడగలదు కానీ అసలక్కడ స్కూలే లేకపోతే లోక్‌పాల్ బిల్లు ఏం చేయలేదని కేజ్రీవాల్ వివరించారు. అయితే, ఆ తరువాత.. తానలాంటి ప్రకటన ఏదీ చేయలేదని సోమవారం సిబల్ స్పష్టంచేశారు. బలమైన అవినీతి వ్యతిరేక చట్టం రూపకల్పనలో తాను హజారే వెంటే ఉంటానన్నారు. సిబల్ ఆదివారం నాడు ఒక సభలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఆ సభలో ఆయన.. ‘నేనో ప్రశ్న వేస్తాను. ఒక పేదబాలుడికి ఎలాంటి విద్యాసౌకర్యాలు అందనప్పుడు, ఆ బాలుడికి లోక్‌పాల్ ఎలా సాయపడ్తుంది? వైద్యం చేయించుకోవాలనుకుంటున్న ఒక పేదవాడికి లోక్‌పాల్ ఎలా సాయపడుతుంది?’ అని ప్రశ్నించారు. కాగా, తన వ్యాఖ్యలపై సిబల్ సోమవారం వివరణ ఇచ్చారు. ‘బిల్లు పరిధి వేరు.. సామాన్యుడి సమస్యలు వేరు’ అని మాత్రమే తన వ్యాఖ్యల ఉద్దేశమని పేర్కొన్నారు. లోక్‌పాల్ కేవలం అవినీతికి సంబంధించినదని చెప్పానన్నారు.

Lokpaal

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us