|
|
భారత క్రికెట్‌లో సచిన్ ఎవరెస్టు. అయితే అతి తక్కువ కాలంలో మాస్టర్‌కు దరిదాపుగా వచ్చిన మరో క్రికెటర్ కెప్టెన్ ధోని. తన నాయకత్వ ప్రతిభతో అటు జట్టును, ఇటు మాజీలను తన అభిమానులుగా చేసుకున్నాడు. ఫలితంగా ప్రస్తుతం భారత క్రికెట్‌లో తిరుగులేని నాయకుడిగా ప్రశంసలు పొందుతున్నాడు. ఇంత క్రేజ్ సంపాదించినా తాను సాధించాల్సింది చాలా ఉందని ఈ జార్ఖండ్ డైనమైట్ చెబుతున్నాడు. క్రికెట్‌లో మాస్టర్ అంత ఎత్తుకు ఎదగాలని ఆరాటపడటమే కాదు... అతడిలా దేశానికి సేవ చేసేందుకు ప్రయత్నిస్తానని ధోని తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. జట్టులోకి వచ్చిన కొత్తలో మహిని చూసి ఇతను భారత కెప్టెన్ అవుతాడ ని ఎవరూ ఊహించలేదు. కానీ అతనిలోని కెప్టెన్సీ ప్రతిభను పసిగట్టింది ఒక్క సచిన్ మాత్రమే. అందుకే బోర్డుతో తన మాటగా చెప్పి మరి ధోనికి నాయకత్వ బాధ్యతలు దక్కేలా చేశాడు. అందుకేనేమో ఏకంగా ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు కప్‌ను అందించి మరీ మాస్టర్ రుణం తీర్చుకున్నాడు. ముందుముందు అతనిలా ఎదగాలనీ ఆరాటపడుతున్నాడు. అలాగే తన కెరీర్‌లో బెస్ట్ కెప్టెన్ ధోనియే అని మాస్టర్ ఇచ్చిన ప్రశంసలకు పొంగిపోతున్నాడు మన కెప్టెన్. ‘నా కెరీర్ మొత్తం నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నా భుజాలపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తా. సచిన్‌తో కలిసి ఆడటం చాలా ఆనందాన్నిస్తుంది. అది నాకు లభించిన గొప్ప గౌరవం కూడా. అతనిలాగే దేశానికి సేవ చేయాలనీ కోరుకుంటున్నా’ అని ఐపీఎల్ మీడియా సమావేశంలో ధోని వ్యాఖ్యానించాడు. మాజీ కోచ్ కిర్‌స్టెన్, ఐపీఎల్‌పై కెప్టెన్ మాట్లాడిన విషయాలు అతడి మాటల్లోనే...
కిర్‌స్టెన్ గురించి: కోచ్‌గా గ్యారీ జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. అలాగే గొప్ప ప్రమాణాలను నిర్దేశించారు. అతను వెళ్లిపోవడం బాధగా ఉంది. చాలా కోల్పోతున్నాం. కిర్‌స్టెన్ స్థానంలో ఎవరు వచ్చినా... వాళ్లు కచ్చితంగా మరింత గొప్పవాళ్లయి ఉండాలి. ఇందులో సందేహం లేదు.
ఐపీఎల్-4పై: కిక్కిరిసిన షెడ్యూల్. కాబట్టి ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోతారు. దీంతో ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. గాయాలతో పోరాడాలి. భారత క్రికెటర్లకు ఇది మరింత భారం. రాబోయే కాలంలో మా ముందు బిజీ షెడ్యూల్ ఉంది. మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు ఇది కొద్దిగా కష్టం.
0 comments:
Post a Comment