|
తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బుధవారం ఆయన భద్రాచలంలో విలేకరులతో, వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో జరిగిన పోలవరం వ్యతిరేక సభలో మాట్లాడారు. ఇటీవల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, పదో తరగతి పరీక్షలు, ఉగాది పండుగ సందర్భంగా కొన్ని ఉద్యమ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి తెలంగాణ మండల స్థాయి జేఏసీల్లో తప్పనిసరిగా ఒక గిరిజనుడు సభ్యుడిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ఏజెన్సీలోని 274 గిరిజన గ్రామాలు జలసమాధి కావటంతో పాటు, వేలాది ఎకరాల అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశముందన్నారు.
భద్రాచలం రామాలయం కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోస్తా పెట్టుబడిదారుల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం నిర్మాణాన్ని అన్ని గిరిజన సంఘాలతో పాటు తెలంగాణవాదులు, మేధావులు వ్యతిరేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంఘాలు చేపట్టే ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కలిసి పోరాడుతుందని అన్నారు. కేవలం సాగునీటి అవసరాల కోసం ఉపయోగపడేలా ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ైచె ర్మన్ చందా లింగయ్య, భద్రాచలం జడ్పీటీసీ గుండు శరత్, స్థానిక జడ్పీటీసీ ముత్యాల రామారావు, ఏపీవీవీయు కన్వీనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

0 comments:
Post a Comment