|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను పీసీసీ కొట్టిపారేసింది. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధులు బి.కమలాకరరావు, పద్మజారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘‘చంద్రబాబూ.. ప్రజల గురించి ఏమనుకుంటున్నారు? మీరేం చెప్పినా జనం నమ్మేస్తారనుకుంటున్నారేమో! కాంగ్రెస్‌తో విభేదించి ఎంపీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపించిన జగన్ మళ్లీ ఆ పార్టీతో ఎట్లా కుమ్మక్కవుతారు? జనం అంత పిచ్చివాళ్లనుకుంటున్నారా?’’అని వారు సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా చంద్రబాబు ఉద్యమం చేయడం విడ్డూరమని వారు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌తో బషీర్‌బాగ్‌లో ఉద్యమం చేస్తున్న వారిపై తూటాలు పేల్చి పలువురిని పొట్టనపెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి చెప్పేమాటలను వినేస్థితిలో జనం లేరన్నారు.

0 comments:
Post a Comment