|
అన్నా హజారే దీక్షకు కేంద్రం దిగివచ్చి కమిటీని వేస్తామంటూ ప్రకటించడం సంతోషదాయకమే అయినా, అది పాక్షిక విజయం మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. మంగళవారం మాకినేని బసవ పున్నయ్య 19వ వర్ధంతి సభలో రాఘవులు మాట్లాడుతూ అన్నా హజారే దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు రావడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయనే భయం తదితర కారణాల వల్ల కమిటీ వేస్తామంటూ కేంద్ర ప్రకటించిందని అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదింపచేసుకోవడం, సక్రమంగా దానిని అమలుచేసుకోవడమనే అంశాలు ప్రస్తుతం మన ముందున్నాయని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్ష చేస్తే దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ అవినీతికి పాల్పడినవారు, అవినీతి వల్ల లబ్ది పొందిన వారు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అవినీతిపై జరుగుతున్న దీక్షను వ్యతిరేకించి దానిని బలహీనపర్చడం కాకుండా ఆ దీక్షకు మద్దతు పలకడం, కలిసిపోవడం ద్వారా దానిని బలహీనపర్చాలనేదే వారి ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాన్ని లోక్‌పాల్ బిల్లు ఆదిలోనే నాశనం చేసేందుకు, ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అవినీతిని నిర్మూలించడం ద్వారానే దేశంలోని పేదల సమస్యలన్నీ పరిష్కారం కాబోవంటూ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ వ్యాఖ్యానించడం ఈ కోవలోకే వస్తుందని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం పోరాటం చేయడం మంచిదేనని, అయితే అదే సమయంలో అవినీతి రహితంగా ఉన్నవారు మతతత్వవాదులైనా, ఫాసిస్టులైనా ఫర్వాలేదనే విధంగా వ్యవహరించకూడదని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి అవినీతి రహితుడంటూ హజారే కితాబు ఇవ్వడం గుర్తుచేసుకోవాలని రాఘవులు వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాటం చేస్తూనే లౌకికవాద పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని అన్నారు.
www.Andhra Bhoomi.net
www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment