14 April 2011

వైఎస్‌.. మనవాడే !

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడేనన్న విషయాన్ని కడప ఓటర్లకు విస్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. బుధవారం తనను కలసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పలు అంశాలపై ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులు కచ్చితంగా గెలవాల్సిందేనని, ఆ బాధ్యత మీదేనని సోనియా సీఎంకు స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రానున్న కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులు కచ్చితంగా గెలవాలని, వారిని గెలిపించే బాధ్యత మీదేనని ఆమె కిరణ్‌కు విస్పష్టంగా, నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీ మీ మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. పార్టీ అభ్యర్ధులను గెలిపించి, కాంగ్రెస్‌ను సవాల్‌ చేసి వెళ్లిన వారికి తగిన హెచ్చరికలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో, పేరు వినియోగించుకునే అంశంపై తర్జన భర్జన జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

దీనిపై ఎలాంటి మొహమాటం, ఆందోళన అవసరం లేదని వైఎస్‌ మనవాడేనని ఆమె స్పష్టం చేశారు. వైఎస్‌ అనే వ్యక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీ వల్లే ఎదిగారని, ఆయనకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్‌పీ నేత, రెండుసార్లు సీఎం పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. 2004లో డీఎస్‌, పీజేఆర్‌ వంటి సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని కాదని వైఎస్‌కే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్‌ లేకపోతే వైఎస్‌ లేరని, ఇదే విషయాన్ని కడప ప్రజలకు వివరించి అదే అంశాన్ని ప్రచారంలో వాడుకోవాలన్నారు.

ఉప ఎన్నికల ప్రచారానికి తాను అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. ప్రచారానికి రావల్సిందిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్ధించిన సందర్భంగా.. ఆమె తాను రానవసరం లేదని, గులాంనబీ ఆజాద్‌, పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌ వస్తారన్నారు. ఎన్నికలు తనకు, వైఎస్‌కు మధ్య జరుగుతున్నవిగా జగన్‌ చేస్తున్న ప్రచారాన్ని సోనియా ప్రస్తావించారు. దీన్ని సీరియస్‌గా పరిగణించి ఎన్నికల్లో విజయంపై దృష్టి సారించాలని ఆదేశించారు. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బయటకువెళ్లిన వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జగన్‌ వెంట ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us