|
|
దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తప్పు పట్టారు. అస్సాంకు చెందిన మన్మోహన్ సింగ్ ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై మోడి విమర్శనాస్త్రాలు సంధించారు. గురువారం నాడు గాంధీనగర్‌లో జరిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం ఆయన విమర్శలకు వేదిక అయింది. గాంధీనగర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన ఒక సెమినార్‌లో మోడి పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంత్యుత్సవాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో ప్రధాని ఓటు హక్కు వినియోగించుకోలేదన్న విషయం తెలిసింది. దీనితో నా మనసెంతో ఆవేదనకు గురైంద’ని మోడి అన్నారు.‘అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం మనకు ఓటు వేసే హక్కు కల్పించింది. అలాంటిది ప్రధాని ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఈ దేశ ప్రజలందరికీ చాలా బాధ కలిగించే విషయం’ అని మోడి ఆవేదన వ్యక్తం చేశారు. సింగ్, ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ అస్సాంలోని దిస్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నమోదిత ఓటర్లు. ఇక్కడ ఈ నెల 11న పోలింగ్ జరిగింది. మన్మోహన్ సింగ్ అస్సాం రాష్ట్ర నుంచే రెండు దశాబ్దాలుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండడం గమనార్హం.
0 comments:
Post a Comment