29 April 2011

ఉద్యమాలతో తెలంగాణ రాదు: తెరాస నేత పోచారం

నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలతో రాదనే విషయం నిరూపితమైందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందువల్ల రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని రాజకీయ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. దీనిపై గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు.
నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చని ఈ పార్టీ తెలంగాణలో కనుమరుగు కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ తన మాటను నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. తన రాజీనామాను ఆమోదించ కూడదని తెదేపా సభ్యులు విన్నవించడం అవివేకమన్నారు.
తెలంగాణ వ్యతిరేక పార్టీలు కోట్లు గుమ్మరించినా ప్రజలు వారిని ఆదరించరని హెచ్చరించారు. తెదేపా అర్థరహితంగా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాదని నిరూపితమైందన్నారు. అందువల్ల ఈ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని కోరారు. తెలంగాణ కోసం పోరాడే వారిని ప్రజలు కడుపున పెట్టుకొని తీర్పు ఇస్తారని అన్నారు.
తెలంగాణ కోసం పోరాడకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సూచించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలతో పాటు బాన్సువాడ ఎన్నికలు జరగకుండా ఉండటానికే కాంగ్రెస్, తెదేపాలు కలిసి రాజీనామా ఆమోదించకుండా కుట్ర చేశాయని ఆరోపించారు. తన రాజీనామాను ఇప్పటికైనా ఆమోదించినందుకు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.

T.R.S

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us