|
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితులు భవిష్యత్‌లో ఉత్పన్నంకాబోవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి సంకట స్థితి ఎదురైతే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామన్నారు.
కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన బుధవారం సుడిగాలిలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీతో తాను పొత్తు పెట్టుకోబోతున్నట్టు కొందరు కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. భాజపాకు స్నేహాస్తం అందించే ప్రసక్తే లేదన్నారు.
అయితే, దేశ, రాష్ట్ర రాజకీయ అవససరాలు, ప్రజల సంక్షేమం దృష్ట్యా భాజపాతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఖచ్చితంగా దేశంలోని ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న షరతు విధిస్తామన్నారు. తమ డిమాండ్‌కు స్పష్టమైన హామీ ఇస్తేనే చేతులు కలుపుతామని చెప్పారు.
ఇకపోతే ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. వందల కోట్ల రూపాయలు చేతిలో పట్టుకుని యధేచ్చగా తిరుగుతూ ఆ డబ్బులు ఎవరికి పంచాలో వారికి అర్థం కావడం లేదన్నారు.

0 comments:
Post a Comment