|
కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహానేత వైఎస్‌ఆర్ పాదయాత్ర పుణ్యంతోనే సోనియాగాంధీ రెండు పర్యాయాలు ఢిల్లీ గద్దెనెక్కి రాజ్యమేలుతున్నారన్నారు.
ఆ విశ్వాసాన్ని మరిచిపోయిన కాంగ్రెస్ నేతలు దివంగత మహానేతను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వైఎస్ మంత్రివర్గం సమక్షంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలపై హౌస్ కమిటీ వేయడం కేవలం ఆయనపై బురదజల్లే ప్రయత్నమేనని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే శతకోటి తప్పులు చేసిన చంద్రబాబుపైన, మొత్తం రాష్ట్ర మంత్రివర్గంపైనా హౌస్ కమిటీ వేయాలని జగన్ డిమాండ్ చేశారు. దివంగత నేత తనప్రాణాలను ఫణంగాపెట్టి 1600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కేంద్ర రాష్ట్రాల్లో అధికారాన్ని తెచ్చారన్నారు. ఆ కారణంగానే సోనియా గాంధీ రాజ్యాన్ని ఏలుతున్నారన్నారు.
తాను కూడా ఏ మంత్రిపదవికో ఆశపడి, విశ్వసనీయతను పక్కన పెట్టి సోనియా గాంధీతో చేతులు కలిపి వుంటే.. ఈ ఉప ఎన్నికలు వచ్చేవి కావన్నారు. అందుకే ఈ ఎన్నికలను ధర్మానికి అధర్మానికి జరుగుతున్న సమరంగా తాను పోల్చుతున్నట్టు జగన్ పేర్కొన్నారు.

0 comments:
Post a Comment